హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో భాగంగా పురావస్తు కట్టడాల కూల్చివేతలపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో పిటిషనర్లు దాఖలు చేసిన అఫిడవిట్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టిన నాలుగో కారిడార్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన మెట్రో రెండో దశ విస్తరణ పనులను నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ (ఏపీడబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు రహీంఖాన్ పిల్ దాఖలు చేశారు. దీనిపై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం చేపట్టిన విస్తరణ పనుల వల్ల పరిసర ప్రాంతాల్లోని చారిత్రాత్మక కట్టడాలపై ప్రభావం పడుతుందని చెప్పారు. చార్మినార్, ఫలక్‌నుమా, పురాణీహవేలి, దారుల్షిఫా, మొఘల్‌పురా టూంబ్స్ తదితర కట్టడాలకు ప్రమాదం వాటిల్లుతుందని తెలిపారు. ఇకడ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే అకడ అధికారులు కూల్చివేత పనులు చేపడుతున్నారని చెప్పారు. అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ దీనిపై సమగ్ర వివరాలతో కౌంటరు దాఖలు చేయడానికి ఈ నెల 22 వరకు గడువు కోరారు. తదుపరి విచారణ దాకా పురావస్తు కట్టడాలుగా ప్రకటించినవాటి జోలికి వెళ్లబోమని హామీ ఇచ్చారు. దీన్ని రికార్డు చేసిన ధర్మాసనం విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.