హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ) : సముద్రంలో అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఒకవైపు వాయుగుండం తుఫానుగా మారితే.. మరోవైపు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి బుధవారం ఉదయం ఈశాన్య ఇండోనేషియా ప్రాంతంలో తుఫాన్‌గా మారింది. అయితే వాయువ్య దిశలో కదులుతూ ఉదయం 07:30 నుంచి 08:30 గంటల మధ్యలో ఇండోనేషియా తీరాన్ని దాటగా రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో కదిలి తూర్పు దిక్కులో కదులుతూ బలహీనపడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈ తుఫానుకు ‘సెన్యార్’ అని పేరు పెట్టినట్టు పేరొన్నది.
అయితే తెలంగాణపై ఈ తుఫాను ప్రభావం లేదని, అల్పపీడనం కారణంగా రాబోయే మూడు రోజులు అన్ని జిల్లాల్లో పొడి వాతావరణం ఉండనున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక శ్రీలంక తీరం సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 24గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదిలి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నది. సముద్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పులతో పాటు, పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 నుంచి 18 డిగ్రీల మధ్య కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.