హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రానున్న మూడ్రోజులు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ రాజస్థాన్, పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి గుజరాత్, మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని తెలిపింది. దీంతో తెలంగాణలోని 7జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్టు వెల్లడించింది. 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నది.
ఇదిలా ఉండగా శనివారం రాష్ట్రంలో పలు జిల్లాలో 40 డిగ్రీలకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా మోస్రాలో 43.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైన్నట్టు తెలిపింది. ఇక కుమ్రంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ము లుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబా ద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మలాజ్గిరి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అకడకడ మోస్తరు వర్షం కురిసినట్టు వివరించింది.