హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): మెడిసిటీ మెడికల్ కాలేజీ డ్రగ్స్ కేసులో తవ్వేకొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులకు గంజాయి అలవాటు చేయడంతోపాటు వారి నుంచి సుమారు రూ.కోటిన్నర వరకు వసూలు చేసిన జరీనాబాను నెట్వర్క్ చూసి పోలీసులు నివ్వెరపోతున్నారు. ఈగల్ టీమ్ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నగరంలోని మెడిసిటీ మెడికల్ కాలేజీలో ఈ డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది.
ఈగల్-హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అరస్టైన జరీనాబాను, అర్ఫత్ అహ్మద్‌ఖాన్ నుంచి 82 మంది వినియోగదారులు ఉన్నట్టు గుర్తించారు. వారిలో 32 మంది మెడికోలు ఉండగా, అనుమానం ఉన్న 24 మందికి గురువారం డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో ఇద్దరు విద్యార్థినులు ఉన్నారు. వీరంతా హాస్టళ్లలో ఉండటం గమనార్హం. జరీనాబాను, అర్ఫత్ అహ్మద్‌ఖాన్ లింకులో యూపీఐ లావాదేవీల ద్వారా సుమారు 100 మందికిపైగా డ్రగ్స్ పెడ్లర్లు ఉన్నట్టు గుర్తించారు.
పాజిటివ్ వచ్చిన 9 మందిని డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించారు. ఈ డ్రగ్ నెట్‌వర్క్‌పై ఇంటెజెలిన్స్ అధికారులు ఆరా తీయగా.. జరీనాబాను బ్యాంకు ఖాతాల్లో రూ.1.5 కోట్ల లావాదేవీలు గుర్తించారు. అందులో రూ.26 లక్షలు హైదరాబాద్‌లోని 51 మంది డ్రగ్స్పెడ్లర్లు పంపినవిగా నిర్ధారించారు. మిగిలిన రూ.1.24 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణ చేపట్టారు. ఇక సికింద్రాబాద్‌కు చెందిన అర్ఫత్ అహ్మద్‌ఖాన్ సైతం జరీనాతో రూ.26 లక్షలు లావాదేవీలు జరిపినట్టు తేల్చారు. అతను రెండు కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉండగా.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన జరీనాబాను 4 కేసుల్లో నిందితురాలిగా ఉన్నది. వీరి నుంచి 6 కేజీల గంజాయి, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.