NHAI | హైదరాబాద్, ఫిబ్రవరి 9 ( నమస్తే తెలంగాణ ) : ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్-మన్నెగూడ రహదారి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుమారు 46 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి పనులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రారంభించింది. ఎన్.హెచ్-163 హైదరాబాద్-మన్నెగూడ సెక్షన్ పనుల అగ్రిమెంట్ జరిగి మూడేండ్లు అవుతున్నా ఎన్జీటీ కేసు కారణంగా ఇంతకాలం పనులు ముందుకుసాగలేదు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఇటీవలే ఎన్హెచ్ఏఐ రహదారి నిర్మాణ పనులను ప్రారంభించింది. టీఎస్పీఏ నుంచి మన్నెగూడ వరకు సుమారు 46 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్న ఈ రహదారికి సంబంధించి 92 శాతం భూసేకరణ పూర్తికాగా, 4-5 కిలోమీటర్లు మేర ఇంకా భూసేకరణ చేయాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ (ఎన్.హెచ్-765) నిర్మిస్తే హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి సుమారు 45కిలో మీటర్ల మేర ప్రయాణ దూరం తగ్గుతుంది. సుమారు 187 కిలో మీటర్ల పొడవైన ఈ మార్గంలో ఇదివరకే 125కిలో మీటర్ల మేర నాలుగు లేన్ల హైవే నిర్మాణం పూర్తయింది. మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల పనులు చేపట్టలేదు. టైగర్ రిజర్వు ఫారెస్ట్ కావడంతో పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలుగకుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. దీని కోసం సుమారు రూ. 7000 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించగా, కేంద్రం నుంచి ఇంత వరకు ఎటువంటి సానుకూల స్పందన రాలేదు.