Minister KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షాలకు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ చూపించింది ట్రైలర్ మాత్రమేనని, త్వరలో సినిమా చూపించబోతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, విశ్వనగరానికి బలమైన పునాదులు పడ్డాయని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నగరంలో ఏడాదికి వారం రోజులు కర్ఫ్యూలు ఉండేవని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని వెల్లడించారు. కొంతమంది మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గులకు, చిల్లర పార్టీల మోసాలకు గురైతే ఈ నగరం మరో వందేండ్లు వెనకి పోతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్‌నే గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఇందిరా పార్ నుంచి వీఎస్టీ చౌరస్తా వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి (దివంగత నేత నాయిని నరసింహారెడ్డి ఫ్లైఓవర్)ని శనివారం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 60 ఏండ్లపాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయని పార్టీల మోసపు మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వాలు హైదరాబాద్ సెంట్రల్ నగరాన్ని పెద్దగా పట్టించుకోలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం, అమరవీరుల స్మృతివనం, బాబాసాహెబ్ అంబేదర్ విగ్రహం, ప్రస్తుతం ఈ స్టీల్ బ్రిడ్జి వంటి అనేక కార్యక్రమాలతో సెంట్రల్ హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అంతర్జాతీయ హంగులతో ఇందిరా పార్క్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ బ్రిడ్జి ఏర్పాటుతో ఇందిరా పార్ నుంచి విద్యానగర్ దాకా దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిషారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంతో సంబంధాలు ఉన్న నాయిని నరసింహారెడ్డి అనుబంధాన్ని, ఆయన ఇకడి ప్రజలకు, కార్మికులకు చేసిన సేవలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరును పెడుతున్నట్టు వెల్లడించారు. నాయిని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తూ, అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్న లక్ష్యానికి అనుకూలంగా గట్టి పునాది ఈ తొమ్మిదేండ్లల్లో పడిందని చెప్పారు. గతంలో మాదిరి మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకొనే దుస్థితి లేదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఎంపీ కే కేశవరావు, ఎమ్మెల్సీలు వాణీదేవి, భేగ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, భేతి సుభాష్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌గుప్తా, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, తలసాని సాయికిరణ్ యాదవ్, ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సార్డీపీలో భాగంగా ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జితో మొత్తం 36 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. దక్షిణ భారత దేశంలో రహదారిపై భారీ పొడవున స్టీల్ వినియోగంతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు ఇదే. రూ.450 కోట్లతో 2.63 కిలోమీటర్ల మేర ఈ ఉక్కు వంతెన నిర్మించారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే భూ సేకరణ అవసరం లేకుండా జరిగిన ప్రాజెక్టు, అందులో మెట్రో మార్గం మీదుగా ఈ స్టీట్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహావిద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇందిరా పార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా వీఎస్టీ జంక్షన్ వరకు సులభంగా వెళ్లొచ్చు.