Hyderabad | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ టాప్-5వ ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు 2023 సంవత్సరానికి గానూ ప్రముఖ బ్రిటిష్ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సావిల్స్ తన ‘గ్రోత్ హబ్స్ ఇండెక్స్’ నివేదికలో వెల్లడించింది. ఈ వివరాలను ప్రముఖ స్టాటిస్టిక్స్ పోర్టల్ ‘స్టాటిస్టా’ బుధవారం ప్రధానంగా ప్రచురించింది. నగరాభివృద్ధి, ఆర్థికరంగంలో విశ్వసనీయత, పౌరుల వ్యక్తిగత సంపద, నగరానికి పెరుగుతున్న వలసలు, పనిచేసే జనాభా ఇలా పలు అంశాలను బేరీజు వేసుకొని ఈ నివేదికను రూపొందించినట్టు సావిల్స్ ప్రతినిధులు తెలిపారు.
224 నగరాలను వెనక్కినెట్టి..
2023నాటికి 50 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీడీపీ నమోదు చేసిన ప్రపంచంలోని 230 నగరాలపై సావిల్స్ ఈ అధ్యయనం చేసింది. దాదాపు 224 నగరాలను దాటుకొని హైదరాబాద్ టాప్-5లో నిలిచింది. కాగా, జాబితాలోని టాప్-15 స్థానాల్లో 14 నగరాలు ఆసియాకు చెందినవే కావడం గమనార్హం. తొలి స్థానంలో బెంగళూరు నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై.. హైదరాబాద్ కంటే మూడు స్థానాలు వెనుకబడి 8వ స్థానానికి పరిమితమైంది.
ఆర్థికాభివృద్ధి ఇలాగే కొనసాగితే..
ఐటీ, బ్యాంకింగ్, సేవారంగాలతోపాటు ఫైనాన్స్ రంగంలో పటిష్ఠమైన సేవలకు హైదరాబాద్ చిరునామాగా మారిందని నివేదిక ప్రశంసించింది. హైదరాబాద్ ఆర్థికాభివృద్ధి ఇలాగే కొనసాగితే రానున్న పదేండ్లలో అంటే 2033నాటికి తలసరి జీడీపీ వృద్ధిరేటులో ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉంటుందని నివేదిక అంచనా వేసింది. కేసీఆర్ ప్రభుత్వహయాంలో తీసుకొన్న విప్లవాత్మకమైన నిర్ణయాల కారణంగానే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నివేదికలోని అంశాలు ఈ విషయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నట్టు పేర్కొంటున్నారు.
ఇవి కూడా పరిగణలోకి..
2023 సంవత్సరానికి గానూ ఈ నివేదికను ప్రచురించినట్టు సావిల్స్ ప్రత్యేకంగా పేర్కొన్నది. అప్పటివరకూ అధికారంలో ఉన్న ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకొచ్చిన పాలసీలు, నగరాభివృద్ధి, సేవలు, ఉద్యోగాలు, ఆదాయంలో పెరుగుదల ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొన్నట్టు వివరించింది. ఈ గణాంకాల ప్రకారం రానున్న 2033లో నగరాభివృద్ధి ఎలా ఉంటుందో అంచనా వేసినట్టు పేర్కొంది.
రేవంత్ పాలనలో మసకబారుతున్న బ్రాండ్
కేసీఆర్ పాలనలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.. రేవంత్ పాలనలో తీసుకొన్న ఏకపక్ష నిర్ణయాలతో అంతకంతకూ మసకబారుతున్నది. హైడ్రా కూల్చివేతల కారణంగా హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు 42 శాతం మేర పడిపోయినట్టు పాప్ఈక్విటీ అంచనా వేసింది. నగరంలో రియల్ఎస్టేట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్టు క్రెడాయ్ కూడా వెల్లడించింది. ఆఫీస్ స్పేస్ లీజుల సంఖ్య కూడా తగ్గిపోయినట్టు నివేదికలు పేర్కొన్నాయి.
ఇక, పారిశ్రామికవాడల ఏర్పాటు నిలిచిపోవడం, కార్నింగ్, కేన్స్ తదితర ప్రఖ్యాత కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలిపోవడం, నగరంలో శాంతి-భద్రతలు కరువవ్వడం వెరసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అమాంతం పడిపోతున్నదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 2033నాటికి భాగ్యనగరం నంబర్.1 స్థాయికి చేరుకోవడం సాధ్యంకాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విశ్వసనీయతకు మారుపేరు సావిల్స్
సావిల్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ. దీనికి అమెరికా, యూరప్, ఆసియా, పసిఫిక్, ఆఫ్రికా ఖండాల్లోని 70 దేశాల్లో 700లకు పైగా ఆఫీసులున్నాయి. సుమారు 40 వేలమంది ఈ సంస్థలో పనిచేస్తున్నారు. భారత్లోని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో సావిల్స్ కార్యాలయాలున్నాయి.
వేటి ఆధారంగా రేటింగ్ ఇచ్చారు?