హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రజల సంక్షేమం, రాష్ట్రం మేలు కోసమే పారిశ్రామిక భూముల కన్వర్షన్ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. పెరుగుతున్న ప్రభుత్వ ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకే హిల్టప్ పాలసీని తీసుకొచ్చినట్టు తెలిపారు. ఎవరో ఒకరి కోసం కాకుం డా క్యాబినెట్లో చర్చించి సమష్టిగా తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు. హిల్టప్ పాలసీలో ఎలాంటి అవినీతి లేదని, పూర్తి పారదర్శకంగా అమలుచేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హిల్టప్ పాలసీని పూర్తి పారదర్శకంగా చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామికవేత్తలు నిబంధనలకు అనుగుణంగా ఎవరు ముందుకొస్తే వారికి చేస్తామని చెప్పా రు. పెరుగుతున్న ప్రభుత్వ ఖర్చులకు అనుగుణంగా ఆదాయం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని, అందుకే హిల్టప్ పాలసీ ద్వారా పారిశ్రామిక భూములను కన్వర్షన్ చేసి రాష్ర్టానికి ఆదాయం సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించేందుకు ప్రభుత్వం డిప్యూటీ సీఎం, మంత్రులు ఉత్తమ్, జూపల్లి, తనతో కలిపి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసిందని, ఆదాయ సమీకరణలో భాగంగానే సబ్ కమి టీ పారిశ్రామిక భూములను కన్వర్షన్ చేయాలని ప్రతిపాదించిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్ మహానగరంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
గతంలో బీఆర్ఎస్ సర్కారు పారిశ్రామిక భూముల కన్వర్షన్ కోసం ఎస్ఆర్వో ధర 100% చెల్లించాలనే నిబంధన పెట్టిందని మంత్రి జూపల్లి చెప్పారు. ఐలాస్, అలీప్, నరెడ్కో, క్రెడాయ్ సంస్థలను పిలిచి మాట్లాడామని వాళ్లంతా 5%, లేదా 10% పెట్టాలని డిమాండ్ చేశారని తెలిపారు. తాము ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి వారిని ఒప్పించి 30%గా నిర్ణయించామని వెల్లడించారు.
క్యాబినెట్ సబ్‌కమిటీ సూచనల మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హిల్టప్పై కేటీఆర్, హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రయత్నించాయని, ఇందులో బీఆర్ఎస్ చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను బయటకు పంపించేందుకు చర్యలు తీసుకున్నామని, అధికారులు, నిపుణులు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడి పాలసీని రూపొందించామని, ఇది సరైన నిర్ణయమని వివరించారు. 80 ఫీట్ల రోడ్డు ఉంటే ఎస్ఆర్వో విలువలో 50%, 80 ఫీట్ల కన్నా తక్కువ రోడ్డు ఉంటే 30% ఫీజు తీసుకోవాలని నిర్ణయించామని వెల్లడించారు. 100% ధర చెల్లించాలంటే పారిశ్రామికవేత్తలెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదని, అందుకే వాళ్లకు ఇన్సెంటివ్స్ ఇచ్చేలా ఎస్ఆర్వోలో 30% ఫీజు నిర్ణయించామని తెలిపారు.