ఉప్పల్, నవంబర్ 28: నాచారంలో ఏర్పాటు చేసిన వాల్యూజోన్ హైపర్ మార్కెట్‌ను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార దృక్పథం మారుతున్నదని తెలిపారు. తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు.
చిన్నారి నుంచి వృద్ధుల వరకు అవసరమయ్యే అన్ని రకాల ఉత్పత్తులు ఒకే దగ్గరకు తీసుకురావడం హర్షణీయమని తెలిపారు. ఫ్యాషన్, ఫన్, ఫుడ్ ఒకే ప్రాంతంలో లభించేలా చూడటం అభినందనీయమని, హైపర్ జోన్‌ను ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఫ్యాషన్, కిరాణా సరుకులు, ఫుట్‌వేర్, లగేజ్, ఫర్నిషింగ్, స్టేషనరీ, సాధారణ సరుకులతోపాటు ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ, భారతీయ బ్రాండ్లను వినియోగదారులకు అందించడంపై దృష్టి సారించిందని తెలిపారు.
అందులో భాగంగా ఒకే చోట సమగ్ర రిటైల్ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, దివంగత సత్యనారాయణ ఆలోచనతో వాల్యూజోన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, టీటీడీ బోర్డు సభ్యుడు నన్నూరి నర్సిరెడ్డి, నందమూరి రామకృష్ణ, నిర్వాహకులు ఎస్ రాజమౌళి, పీ వెంకటేశ్వర్లు, ఎస్ సురేశ్ పాల్గొన్నారు.