US Fire Accident | అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో హైదరాబాద్ యువతి కన్నుమూసింది. భారతీయ కాలమానం ప్రకారం గురువారం రాత్రి అల్బనీ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో సహజా రెడ్డి మంటల్లో చిక్కుకుని మరణించింది. ఆమె మరణవార్తను హైదరాబాద్ జీడిమెట్లలో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులకు అమెరికా అధికారులు సమాచారం అందించారు.
జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల ప్రాంతం గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య శైలజ బచ్చన్నపేట మండలంలో ఎస్జీటీగా పనిచేశారు. ఇటీవల డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌కు వచ్చారు. కొన్నాళ్లుగా ఈ కుటుంబం హైదరాబాద్ జీడిమెట్లలోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సహజా రెడ్డి కొంతకాలం కిందట ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లింది. అల్బనీ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లో స్నేహితులతో ఉంటుంది. అయితే గురువారం రాత్రి సహజారెడ్డి ఉంటున్న అపార్ట్మెంట్ పక్కనున్న మరో భవనానికి మంటలు అంటుకున్నాయి. అవే మంటలు వీరి అపార్ట్‌మెంట్‌కు కూడా వ్యాపించాయి. ఆ సమయంలో నిద్రలో ఉన్న సహజా రెడ్డి మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. చదువు పూర్తి అవుతున్న సమయంలో ఇలా అగ్నిప్రమాదానికి గురవ్వడంతో సహజా రెడ్డి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.