హైదరాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ): గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్‌పై ప్రస్తుత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం తో ఆ ఈవెంట్ రద్దయిందని, దానివల్ల రాష్ర్టానికి నష్టం జరిగిందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ రేస్‌తో రాష్ర్టానికి కలిగిన ప్రయోజనం ఏమీలేదని చెప్పారు. తొలుత రేస్నెట్జెన్, ఫార్ములా-ఈ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ట్రైపార్టీ ఒప్పందం జరిగిందని తెలిపారు. ఒక ఈవెంట్ నిర్వహణ తర్వాత ఈ ఒప్పందం నుంచి రేస్నెట్జెన్ తప్పుకున్నదని తెలిపారు.
ఆ తర్వాత ఫార్ములా-ఈ, ప్రభుత్వం మధ్య తిరిగి ద్వైపాక్షిక ఒప్పందం జరిగిందని వివరించారు. ఆ కంపెనీ ఎందుకు తప్పుకున్నదో స్పష్టతలేదని పేర్కొన్నారు. టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తంలో ఫార్ములా-ఈ కంపెనీకి రూ.110 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని, ఇందులో రూ.55 కోట్లు చెల్లించిన తర్వాత ఆ కంపెనీ వెళ్లిపోయిందని వెల్లడించారు. ఇప్పుడు మిగిలిన మొత్తాన్ని చెల్లించాలంటూ కంపెనీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. గతంలో సదరు కంపెనీకి డబ్బులు ఏవిధంగా చెల్లించారనే అంశంపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరుపుతామని, ఇందులో సంబంధం ఉన్నవారెవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.
రేస్ వల్ల రాష్ర్టానికి ఎలాంటి ప్రయోజనం లేదన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. ఫార్ములా- రేస్‌ను పలు దేశాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారు. అలాంటి ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నగరానికి ప్రత్యేక ఖ్యాతి లభించింది. తద్వారా ఇది విదేశీ పెట్టుబడులకు మార్గం సుగుమం చేసింది. దీంతోపాటు ఫార్ములా-ఈ రేస్ ద్వారా హైదరాబాద్ నగర ఆర్థిక రంగానికి సుమారు రూ.600 కోట్ల ప్రయోజనం కలిగినట్టు పలు సంస్థలు పేర్నొన్నాయి.