Rain Alert | నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 12: హైదరాబాద్ ప్రజలు మూడు రోజులు బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరించింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద నీరు ఎకడా నిల్వకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. పాఠశాలలు, కళాశాలలు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్కఫ్రం హోం కల్పించేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్రెడ్డి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరావులతో పాల్గొన్నారు. హెలికాప్టర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. సహాయ చర్యల కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో బుధవారం నుంచి మూడు రోజులు పలు జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రెడ్ అలెర్ట్ జారీ అయిన జిల్లాల్లో హైదరాబాద్ కూడా ఉంది. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఉమ్మడి వరంగల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట జిల్లాల్లో మంగళవారం భారీ వానలు పడినట్టు వెల్లడించింది.
భారీ వర్షం దంచికొట్టడంతో వరంగల్ వణికింది. మంగళవారం తెల్లవారుజామున వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వాన కురిసింది. తెల్లారేసరికి వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సంగెం, ఖిలా వరంగల్, నర్సంపేట, ఖానాపూర్ మండలాల్లోని పలు చెరువులు అలుగుపారాయి. వరంగల్ రైల్వే స్టేషన్ను వరద ముంచెత్తింది. పట్టాలు నీటిలో మునిగాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో 97.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ 100 పడకల దవాఖానలోని గర్భిణుల వార్డులోకి వాననీరు చేరింది. గొల్లబుద్దారం జడ్పీహెచ్ఎస్లోకి ఉదయం 11 గంటలకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చింది. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు రంగంలోకి దిగి వి ద్యార్థులను బయటికి తరలించారు.
నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలంలోని కర్ని పెద్ద చెరువును దాటేందుకు ఉద్యోగులు సాహసం చేశారు. పెద్ద చెరువు మత్తడి పోస్తుండడంతో భారీ ప్రవాహంతో ద్విచక్ర వాహనాలు అవతలి వైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో కర్ని గ్రామానికి చెందిన రైతు ట్రాక్టర్ను తీసుకురావడంతో ఆరోగ్యశాఖ, పాఠశాల ఉపాధ్యాయులు వాహనం ఎక్కి అలుగు దాటి విధులకు హాజరయ్యారు.
రెడ్ అలెర్ట్ జిల్లాలు: వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలు: ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్