హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): మనీలాండరింగ్ కేసులో మెస్సర్స్ హ్యాక్ బ్రిడ్జ్ హెవిట్టిక్ అండ్ ఈసన్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సుమారు రూ.111.57 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఫిర్యాదు మేరకు విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (వీఈఎల్), విక్టరీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్విచ్గేర్స్ లిమిటెడ్ (వీటీఎస్ఎల్) డైరెక్టర్లు మహేంద్రకుమార్ వడ్డినేని, మనోజ్‌కుమార్ వడ్డినేని, వెంకటప్పనాయుడు వడ్డినేని సహా ఇతరులపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
నిందితులు నకిలీ ఆర్థిక పత్రాలు, బోగస్ బ్యాలెన్స్షీట్లు, తప్పుడు వసూళ్లను ఎస్బీఐకి సమర్పించి క్రెడిట్ సౌకర్యాలు పొందారని, బ్యాంకును తప్పుదోవ పట్టించి ఎల్సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) సౌకర్యాలు, క్రెడిట్ పరిమితులను పొందారని సీబీఐ చార్జిషీట్లో పేరొంది. వీరు షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించడంతో ఎస్బీఐకి సుమారు రూ.136.50 కోట్లు నష్టం వాటిల్లినట్టు తేల్చింది.
నిందితులు మహేంద్రాకుమార్ వడ్డినేని, నవీన్ ఖత్రి ఢిల్లీలోని షెల్ కంపెనీల నెట్వర్ ద్వారా రూ.88.93 కోట్ల రుణాన్ని మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. అయితే, 2011, 2021లో ఎస్బీఐ జారీచేసిన విదేశీ బ్యాంక్ గ్యారెంటీ కింద బ్యాంక్ ఆఫ్ బరోడా షార్జా, దుబాయ్‌లో పలు సంస్థలకు రూ.45.10 కోట్లు చెల్లించవలసి వచ్చింది. దీంతో ఎస్బీఐ వడ్డీతో సహా మొత్తం నష్టాన్ని రూ.189.04 కోట్లుగా అంచనా వేసింది.
అందులో రూ.77.47 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగింది. మిగిలిన రూ.111.57 కోట్లు రికవరీ కావాల్సి ఉండటంతో ఈడీ అధికారులు వీఈఎల్, వీటీఎస్ఎల్ డైరెక్టర్లకు ఆస్తులు అందుబాటులో లేవని తెలుసుకొని.. మెస్సర్స్ హ్యాక్‌బ్రిడ్జ్ హెవిట్టిక్ అండ్ ఈసన్ లిమిటెడ్‌లో వీఈఎల్కు 93.28% వాటా ఉందని తెలుసుకొని.. ఆ ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.