కుత్బుల్లాపూర్, మార్చి 11: తల్లిదండ్రులతో కలిసి మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్‌కు వెళ్లిన ఎనిమిదేండ్ల బాలుడిపై ఎలుక దాడి చేసింది. బాలుడికి రెండుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు కుట్లువేసి చికిత్స అందించారు. రెస్టారెంట్ యాజమాన్యంపై బాలుడి తండ్రి పేట్ బషీరాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లోని హైటెన్షన్ లైన్లో ఎస్పీజీ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న మెక్‌డోనాల్డ్స్ రెస్టారెంట్‌కు ఈ నెల 9న ఆర్మీ అధికారి సేవియో హెన్రిక్యూస్ తన కుటుంబంతో కలిసి వచ్చారు.
డైనింగ్ ఏరియా పక్కన ఉన్న వాష్‌రూమ్‌లో నుంచి పెద్ద ఎలుక ఒక్కసారిగా బయటకు వచ్చి సమీపంలో కూర్చున్న ఆయన కుమారుడు డ్వాయిని హెన్రిక్యూస్పైకి ఎక్కి నిక్కర్లోకి చొరబడింది. భయంతో బాలుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన తండ్రి కొడుకు నిక్కర్లో నుంచి ఎలుకను తీసి బయటకు విసిరాడు. అప్పటికే ఎలుక బాలుడి తొడపై పంటితో రెండుచోట్ల తీవ్రంగా గాయపర్చింది. హుటాహుటిన బోయిన్‌పల్లిలోని దవాఖానకు తరలించగా అక్కడి వైద్యులు టెటానస్, యాంటి రేబిస్డోస్లు ఇచ్చి కుట్లు వేశారు. హోటల్లో బాలుడిపై దాడి చేసిన ఎలుక దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కనీస నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న హోటళ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రశాంత్ తెలిపారు.