హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): అది అందమైన అడవి.. అది పట్టణంలో పచ్చని తోట.. అది ‘తెలంగాణకు హరితహారం’తో విలసిల్లుతున్న వనం.. మేడ్చల్ జిల్లాలోని ఆయుష్ వనం అర్బన్ ఫారెస్ట్ పార్కు పరిమళమిది. కాంక్రీట్ కీకారణ్యంలో హరితహారంతో భూతల్లికి ఏ విధంగా ఆరాధన జరుగుతున్నదో తెలిపే అద్భుత ఉదాహరణ ఇది. ఈ పార్కును చూసి ముచ్చటపడిన ప్రపంచ పర్యావరణ వేత్త ఎరిక్ సోల్హెమ్.. పార్కుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసి తెలంగాణలో పచ్చదనం పెరుగుతున్న తీరును శ్లాఘించారు. ‘పచ్చదనంలో భారత్కు తెలంగాణ లీడర్ అయ్యింది, ముఖ్యంగా హైదరాబాద్ ప్రపంచ వృక్షాల నగరం (వరల్డ్ ట్రీ సిటీ)గా అవతరించింది. ఇది అద్భుతం’ అని కొనియాడారు. ఆయుష్ పార్కు హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ప్రకృతి ప్రేమికుల కోసం, పర్యాటకులు సేద తీరేందుకు అద్భుతమైన షెడ్లు నిర్మించారు. ఆ పార్కులోకి అడుగు పెట్టగానే ప్రకృతిలో ఓలలాడుతున్నట్టు ఉంటుంది.