Salman Khan | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తి ఆపలేదని హైదరాబాద్ యూత్ కరేజ్(హెచ్వైసీ) వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సల్మాన్ ఖాన్ గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నా నామినేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా అడ్డుకుంది. నన్ను పోటీకి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిన్నట్నుంచి నన్ను కొనేందుకు పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు విశ్వ ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌లో చేరితే ఏమీ కావాలంటే అది చేసి పెడతామని ఆశ చూపారు. అమ్ముడు పోయే వాణ్ని కాదని కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసి కేటీఆర్‌ను కలిశాను. తెలంగాణ కొసం పోరాడిన యోధుల పార్టీలోనే చేరాలని నా అభిమానులు సూచించారు అని సల్మాన్ ఖాన్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు స్మశాన వాటిక కూడా కేటాయించలేదు .ఇక ఏమిస్తుంది..? ముస్లింల ఓట్లు దండుకుని వారిని ధోఖా చేసిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీలో ముస్లిం నాయకులను కుట్ర పూరితంగా ఎదగనివ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కరైనా ముస్లిం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేరు. కేబినెట్లో ముస్లింలకు స్థానం కల్పించలేదు. సెక్యులర్ విలువలను రేవంత్ రెడ్డి మంట గలుపుతున్నారు. గంగా జమునా తెహజీబ్‌ను కాపాడిన నాయకులు కేసీఆర్, కేటీఆర్ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవడం ఖాయమైపోయింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే. తెలంగాణ అంతటా గులాబీ జెండా ఎగిరేలా మా హెచ్వైసీ సంస్థ కృషి చేస్తుంది. నేను ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చా. మా వాళ్ళే కొందరు నన్ను ఎదగకుండా ఎన్నో అవాంతరాలు సృష్టించారు. కష్టకాలంలో బీఆర్ఎస్ నన్ను అక్కున చేర్చుకుంది. గతంలో కేసీఆర్, కేటీఆర్‌లను భాధ పెట్టే విధంగా మాట్లాడినందుకు క్షమాపణ చెబుతున్నా. జూబ్లీహిల్స్‌లో ప్రతి ఇంట్లో బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నారు. కేటీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు.