హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) అనుకుంటున్నారా లేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అనుకుంటున్నారా? ఉన్నతమైన కమిటీ ఏర్పాటులో చిల్లర రాజకీయం చేసి, రేవంత్ దివాలాకోరుతనాన్ని బయటపెట్టుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీ నియామకం అప్రజాస్వామికం, అన్యాయమని ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. నామినేషన్ వేయని వ్యక్తికి పీఏసీ ఎలా ఇస్తారని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. సభ్యుడిగా కూడా అర్హతలేని వ్యక్తికి చైర్మన్ ఎలా ఇస్తారని నిలదీశారు. ప్రతిపక్షానికి దకాల్సిన పీఏసీ పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తరఫున హరీశ్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి పీఏసీ సభ్యులుగా నామినేషన్లు వేస్తే ముగ్గురికి ఎందుకు అవకాశం లభించలేదని మండిపడ్డారు. బండారం బయటపెడతాడని రేవంత్‌రెడ్డి హరీశ్‌రావు పేరును తొలగించారని ఆరోపించారు. హరీశ్‌రావు అంటే రేవంత్‌కు వెన్నులో వణుకుపుడుతున్నదని అన్నారు. అరికెపూడి గాంధీని దొడ్డిదారిన పీఏసీలోకి అనుమతినివ్వడం రాజ్యాంగ సూత్రాలకు జరిగిన అవమానమని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా పీఏసీని కొత్తగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలను మంటగలిపింది. అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ ఇవ్వడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధం. పార్టీ మారి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేకు ఏ రాజ్యాంగ సూత్రం ప్రకారం పీఏసీ చైర్మన్ పదవి ఇస్తారు? హరీశ్‌రావుకు భయపడి చట్టసభల సాంప్రదాయాన్ని కాంగ్రెస్ తుంగలో తొకింది. రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రగల్భాలు పలికే రాహుల్ గాంధీ దీనికి ఏం సమాధానం చెబుతారు.
– ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే ప్రతిపక్షానికి ఇవ్వకుండా కాంగ్రెస్ పీఏసీ తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. చేతిలో రాజ్యాంగం పట్టుకుని నీతి వాఖ్యలు చెప్పే రాహుల్ గాంధీ మాటలు డొల్ల అని తేలిపోయింది. రాజ్యాంగం మీద గౌరవం ఉంటే తక్షణమే రాహుల్ గాంధీ రేవంత్‌రెడ్డిని ఆదేశించాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్టనిలువునా పట్టపగలు ఖూనీ చేయడమే.
– బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్