Padi Kaushik Reddy | హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. మూడు కేసుల్లో కౌశిక్ రెడ్డికి కరీంనగర్ జిల్లా రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి బెయిల్ మంజూరు చేశారు. రెండు కేసుల్లో రూ.25వేల చొప్పున రూ.50వేల పర్సనల్ బాండ్ సమర్పించాలని ఆదేశించారు. అలాగే అన్ని కేసులు కూడా బెయిలబుల్ సెక్షన్లు కావడంతో కౌశిక్ రెడ్డి కేసుపై రిమాండ్ రిపోర్టును కొట్టివేశారు.
పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో కరీంనగర్లో హై టెన్షన్ నెలకొన్నది. నిన్నటి సాయంత్రం హైదరాబాద్‌లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసింది మొదలు మంగళవారం ఉదయం ఆయన్ను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చే వరకు హై డ్రామా నెలకొన్నది. నిన్న రాత్రి సుమారు 9 -10 గంటల మధ్య కరీంనగర్ పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించి అక్కడి నుంచి వన్ టౌన్ కు తరలించాల్సి ఉండగా పోలీసులు వ్యూహాత్మకంగా త్రీ టౌన్‌కు తరలించారు. అక్కడి నుంచి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. కాగా రాత్రి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తారని తెలియడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు న్యాయవాదులైన మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ మేయర్ సర్ధార్ రవిందర్ సింగ్ త్రీ టౌన్ పోలీసు స్టేషన్ కు వచ్చారు. అర్ధరాత్రి దాటిన తర్వాత మంగళవారం ఉదయం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తామని చెప్పిన పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బస చేసేందుకు పీటీసీ నుంచి ప్రత్యేకంగా ఒక బెడ్ తెప్పించారు.. రాత్రంతా పోలీసు స్టేషన్లోనే ఉంచారు. మంగళవారం ఉదయం పీఎస్ నుంచి కరీంనగర్ రెండో అదనపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చారు.
ఇటువంటి అక్రమ అరెస్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం కరీంనగర్ త్రీ టౌన్ పోలీసు స్టేషన్ నుంచి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చేందుకు తీసుకెళ్తుండగా పోలీస్ వాహనం నుంచి జై తెలంగాణ అంటూ నినాదం చేశారు. అమ్ముడు పోయిన ఒక ఎమ్మెల్యే ను నిలదీసినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని, పండగ పూట రాత్రంతా పోలీసు స్టేషన్ లోనే ఉంచారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.