నల్లగొండ ప్రతినిధి, నవంబర్30(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి కిడ్నాప్ కేసులో దుండగులు దారుణంగా వ్యవహరించిన తీరు వెలుగుచూసింది. బీఆర్ఎస్ నేతల ఆందోళనల అనంతరం ఎట్టకేలకు శనివారం రాత్రి 9 గంటల తర్వాత యాదగిరిని దుండగులు విడుదల చేశారు. బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు ధైర్యం చెప్పారు. అప్పటికే నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్‌ను కలిసిన వారు.. ఆ తర్వాత యాదగిరిని తీసుకొని తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడే ఉన్న సీఐ కొండల్‌రెడ్డి, ఎస్ఐ శంకర్‌తో మాట్లాడారు. గ్రామంలో జరుగుతున్న అరాచకంపై వారిని నిలదీశారు. బాధితుడు తను జరిగిన దారుణాలను పోలీస్ అధికారులకు యాదగిరి వివరించారు.
నకిరేకల్‌లో బయటకు వెళ్లిన యాదగిరిని కొందరు అటకాయించి కారులో ఎక్కించుకుని వేర్వేరు ప్రాంతాలకు రోజంతా తిప్పారు. హైదరాబాద్ వైపు తీసుకెళ్తూ వేర్వేరు ప్రాంతాలకు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేసినట్టు ఆవేదన వ్యక్తంచేశాడు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఓ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి నామినేషన్ వేస్తే ప్రాణాలు ఉండవంటూ హెచ్చరించారు. యాదగిరితో తన భార్య నాగలక్ష్మికి ఫోన్ చేయించారు. నేను క్షేమంగానే ఉన్నా.. నామినేషన్ వేయవద్దు.. అంటూ ఫోన్లో చెప్పించినట్టు తెలిపాడు. ఈ క్రమంలో మెడపై కత్తులు పెట్టి, దుర్భాషలాడుతూ హింసించినట్టు వివరించాడు. మద్యం తాగుతూ తనతో మూత్రం తాపించినట్టు యాదగిరి చెప్పాడు. ఈ విషయాన్ని అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌లో సీఐ, ఎస్ఐ ముందు బాధితుడు యాదగిరి వివరించాడు. యాదగిరితో అంతకుముందే పోలీసులు తనంతట తానే వాళ్లతో కలిసి వెళ్లినట్టుగా స్టేట్మెంట్ తీసుకున్నట్టు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గుర్తించారు.
ఇదే స్టేట్మెంట్ను సీఐ, ఎస్ఐ ముందు పెట్టి ఇదేం పద్ధతి అని నిలదీశారు. దీంతో పోలీసులు నీళ్లు నమిలారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ, తక్షణమే కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు ప్రకటించారు. అదే గామంలో వార్డు స్థానానికి నామినేషన్ వేసిన ఓ అభ్యర్థిని సైతం కాంగ్రెస్ నేతలు బెదరించారని తెలిసింది. గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు ఊట్కూరి సందీప్‌రెడ్డి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాడు. తాను ఏకగ్రీవం కావడం కోసం ప్రత్యర్థులెవరూ నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు దిగుతుండటంతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని తెలిసింది. గతంలో సర్పంచ్ భర్త విజయ్‌రెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత ఎన్నికల్లో ఎదురే ఉండకూడదన్న ధోరణతో వ్యవహారిస్తున్నారని సమాచారం. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుండాలను ప్రోత్సహిస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బెదిరిస్తూ పోటీ చేయకుండా అడ్డుకుంటున్నాడని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విమర్శించారు.
మహిళా సర్పంచ్ అభ్యర్థికి వేధింపులు
సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్యనేత అనుచరుడి నిర్వాకం బయటపడింది. సర్పంచ్ పదవిని తన తల్లికి ఏకగ్రీవంగా ఇప్పటించాలని ప్రయత్నించగా, బెడిసికొట్టింది. దీంతో పగబట్టి పోటీచేసిన మరో అభ్యర్థిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసేందుకూ వెనుకాడ లేదు. గ్రామానికి చెందిన శ్రీజ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో ఆయనకు మింగుడు పడలేదు. శ్రీజ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదవుతున్నది. అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌తో రెండేండ్లుగా ప్రేమలో ఉన్నది. ఆమె పోటీకి ముందుకు రాగా, ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తన ప్రేమికుడు చంద్రశేఖర్ సహాయంతో శ్రీజ సర్పంచ్ పదవికి ఆదివారం నామినేషన్ వేసింది.
అనంతరం చంద్రశేఖర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నది. ఈ విషయం తెలుసుకున్న ఆ కాంగ్రెస్ నేత ఆమెను బరిలో నుంచి తప్పించేందుకు పావులు కదిపాడు. తమ బిడ్డను కిడ్నాప్ చేశారంటూ చంద్రశేఖర్‌పై శ్రీజ తల్లిదండ్రులతో సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. పోలీసులు ఫోన్‌చేసి రమ్మనడంతో శ్రీజ, తన భర్త చంద్రశేఖర్‌తో కలిసి ఆదివారం ఉదయం సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. తాను మేజర్‌నని, ఇష్టపూర్వకంగానే చంద్రశేఖర్‌ను పెళ్లి చేసుకున్నానని, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని పోలీసులకు శ్రీజ స్టేట్మెంట్ ఇచ్చింది. కాంగ్రెస్ మద్దతుదారు ఏకగ్రీవం అవుతుందని భావించి, శ్రీజను పోలీస్‌స్టేషన్‌లో ఉంచే ప్రయత్నం చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పోలీస్‌స్టేషన్ వెళ్లి శ్రీజను పంపించాల్సి వచ్చింది.