కూసుమంచి(నేలకొండపల్లి), ఏప్రిల్ 14 : ఒకరికొకరు తోడూనీడగా ఉంటున్న ఆ వృద్ధ దంపతులు విధి వక్రీకరించి గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రపురంలో సోమవారం చోటుచేసుకున్నది. బాదిటి హనుమారెడ్డి(81), యశోద (76) దంపతులు రామచంద్రాపురంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆదివారం ఇంట్లో పని చేసుకుంటుండగా యశోద కిందపడగా తలకు బలమైన గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మం దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉద యం మరణించింది. భార్య మరణ వార్త విన్న హనుమారెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దవాఖానకు తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తిరుమలలోతెలంగాణ యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): తిరుమలలో తెలంగాణ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌కు చెందిన ముని సాత్విక్ (25) తన బంధువు నరేశ్‌తో కలిసి తిరుపతికి వెళ్లాడు. సోమవారం వేకువజామున తన సోదరి స్వర్ణరేఖకు ఫోన్ చేసి తిరుమలలోని కళ్యాణి సత్రం మూడంతస్తుల పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు తెలిపాడు. సోదరి వెంటనే గూగుల్‌లో తిరుమల పోలీసుల నంబర్ సెర్చ్ చేసి వారికి విషయాన్ని తెలిపింది. అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి చూడగా యువకుడు భవనం పై నుంచి దూకేందుకు సిద్ధంగా ఉన్నట్టు గమనించి కాపాడారు. సదరు యువకుడికి మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు గుర్తించారు.