ఎల్బీనగర్, సెప్టెంబర్ 13: ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించడంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని తెలంగాణ నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్‌కుమార్ విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు శనివారం నందినగర్‌లోని తన నివాసంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. నిరుద్యోగుల కోసం ఈనెల 15నుంచి దిల్‌సుఖ్‌నగర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్టు కేటీఆర్‌కు వివరించారు. నిరుద్యోగులకు అండగా నిలవాలని, తన నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. దీనికి స్పందించిన కేటీఆర్.. నిరుద్యోగుల పోరాటానికి తన మద్దతు ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. అదేవిధంగా నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటుగా పలువురు నాయకులను అశోక్‌కుమార్ కలిశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు రాజారాం యాదవ్, చంద్రశేఖర్, ప్రశాంత్, ప్రణీత్, రవికుమార్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.