రవీంద్రభారతి, ఫిబ్రవరి2: ఈ నెల 7న మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపడుతున్న లక్ష డప్పులు, వేల గొంతుకలు కార్యక్రమానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ వెల్లడించారు. ఫిబ్రవరి 6న నిర్వహించాలనుకున్న ఇందిరాపార్క్ దీక్షా కార్యక్రమాన్ని విరమించుకుంటున్నామని తెలిపారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సూచన మేరకు తాను దీక్షను విరమించుకొని, లక్ష డప్పులు, వేల గొంతుకలు కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దారులు వేరైనా తమ లక్ష్యం ఒక్కటేనని, విభేదాలను సైతం పక్కనపెట్టి వర్గీకరణ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా ప్రభుత్వానికి భట్టి విక్రమార్క, వివేక్ వెంకటస్వామి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో మధుమాదిగ, రమేశ్మాదిగ, యాదయ్య, పీ రమేశ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.