హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): క్రిమికీటకాలు, పక్షులు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల్లో మరొకటి చేరింది. దీనిని ‘జోంబీ డీర్’ వ్యాధిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీనిని ‘క్రానిక్ వేస్టింగ్ డిసీజ్’ లేదా ‘ప్రియాన్’ వ్యాధి అని పిలుస్తున్నారు. జింకలు, దుప్పుల జాతులకు సోకే వ్యాధిని అమెరికాలోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో గుర్తించారు.
జంతువుల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి దాదాపు ఏడాది పడుతుందని పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకిన జంతువులో జంతువు సమతుల్యత కోల్పోవడం, అధిక మూత్రవిసర్జన, బరువు తగ్గడం, అస్థిరత, నరాల సంబంధిత సమస్యలు ఉంటాయని తెలిపారు. ఇది మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉన్నదని, దీనివల్ల చిత్త వైకల్యం, నడవడం మా ట్లాడటంలో ఇబ్బంది, అలసట వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. అమెరికాలో ఈ సంక్రమణ అత్యంత వేగంగా పెరుగుతున్నట్టు గుర్తించారు.