KCR | కోదాడ, ఫిబ్రవరి 11: కృష్ణానదిపై ఉన్న నీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవటంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు శాశ్వత నష్టం కలిగించే ప్రభుత్వ చర్యపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట శంఖం ఊదారు. కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు కాపాడటం కోసం 13వ తేదీన నల్లగొండలో భారీ సభను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జల హక్కుల కోసం కేసీఆర్ సాగించిన పోరాటాలను తెలంగాణవాదులు గుర్తుచేసుకొంటున్నారు.
కోదాడ నుంచి హాలియాకు పాదయాత్ర
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పొలాలను ఎండబెట్టిన వలస పాలకుల మెడలు వంచేందుకు కేసీఆర్ ఆనాడే నడుం బిగించారు. ఎడమ కాల్వకు జరుగుతున్న అన్యాయంపై ఆంధ్ర – తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కోదాడ నుంచి హాలియా వరకు వేలమంది ఉద్యమకారులతో పాదయాత్ర నిర్వహించారు. హాలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నల్లగొండ జిల్లా రైతులకు వలస పాలకులు చేసిన ద్రోహాన్ని ఎండగట్టారు. దాంతో దిగొచ్చిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కుడి కాల్వకు నీటిని నిలిపివేసి ఎడమ కాల్వకు విడుదల చేసింది. స్వరాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి 9 ఏండ్లలో అన్ని రంగాలను అభివృద్ధి బాట పట్టించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. 2003 ఆగస్టు 26న సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పొలాలకు నీటిని విడుదల చేయాలని, ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కోదాడలో కేసీఆర్ పాదయాత్ర ప్రారంభించారు.
కోదాడలోని తెలంగాణ చౌరస్తా వద్ద జరిగిన సమావేశంలో నాటి పాలకుల ధోకాను సవివరంగా ప్రజలకు వివరించారు. ఆ తర్వాత చిలుకూరు నుంచి హుజూర్నగర్ మీదుగా గరిడేపల్లి, చిల్లేపల్లి, మిర్యాలగూడ నుంచి నిడమనూరు మీదుగా హాలియాకు ఐదు రోజుల పాటు పాదయాత్ర కొనసాగింది. అక్కడ నిర్వహించిన సభకు బీఆర్ఎస్ అప్పటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగదీశ్‌రెడ్డి, అప్పటి జిల్లా అధ్యక్షుడు తిప్పన విజయసింహారెడ్డి నేతృత్వం వహించారు. ఆ సభలో ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఉమ్మడి పాలకులు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎలా విధ్వంసం చేశారో ప్రజలకు కేసీఆర్ వివరించారు. ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించడంతో టీడీపీ ప్రభుత్వం తలొగ్గి నీటిని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ పాదయాత్ర ఒక అపురూప ఘట్టమని చెప్పవచ్చు.
హాలియాలో 20 వేల మందితో ధర్నా
కేసీఆర్ 14 ఏండ్లు చేసిన అలుపెరుగని పోరాటంతోనే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. 2003లోనే సాగర్ ఎడమ కాల్వపై రై తులకు జరుగుతు న్న అన్యాయాన్ని ఎండగట్టారు. ఆ సంవత్సరం ఆగస్టు 26న ఆయనతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్రలో అడు గు కలిపాను. రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని అప్పట్లోనే మాకు చెప్పారు. ఆ తర్వాత హాలియా ధర్నాకు 20 వేల మంది హాజరయ్యారు. ధర్నాలో కేసీఆర్ మాట్లాడుతుండగానే ఆంధ్రా అధికారులు కుడి కాల్వకు నీటిని విడుదల చేశారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ధ ర్నాకు తలొగ్గిన ఆంధ్రా పాలకులు కుడి కా ల్వకు నీటిని నిలిపివేశారు. సీఎం కేసీఆర్ ప దేండ్లలో 18 విడతలు ఎడమ కాల్వ ద్వారా పంటలకు సాగునీరు అందించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండో పంటకు కూడా నీళ్లు అందించలేని దుస్థితిలో ఉన్నది. ఉద్య మ నేత కేసీఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతాం.
– తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు