కాళేశ్వరం: కాళేశ్వరంలో (Kaleshwaram) సరస్వతి పుష్కరాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. సరస్వతి ఒడిలో పుష్కర స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వీఐపీ ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. శనివారం ఉదయం కాళేశ్వరం చేరుకున్న ఆయన సరస్వతి నదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, సాయంత్రం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గోదావరి హారతి కార్యక్రమానికి హాజరుకానున్నారు.
పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కాళేశ్వరం సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరం నుంచి మహదేవ్పూర్ మధ్యలో 5 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 3 గంటలుగా వాహనాలు స్తంభించిపోయాయి. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ ఇప్పటికీ క్లియర్ కాలేదు. దీంతో అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
కాగా, శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున కాళేశ్వరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. వీఐపీ ఘాట్లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, టెంట్లు కూలిపోయాయి. పలుచోట్ల ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు గాలికి కొట్టుకుపోయాయి. భారీ వర్షం కురిడంతో కాళేశ్వరం మొత్తం బురదమయమైంది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.