హైదరాబాద్: రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన దసరాకు ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారు. పండుగకు బంధువులు, స్నేహితులను కలుసుకోవడానికి అవకాశం ఉండటంతో కుటుంబంతో కలిసి ఇంటిబాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, సొంత, ప్రైవేటు వాహనాల్లో పట్నం వాసులు పల్లె బాట పట్టడంతో హైదరాబాద్ ఖాళీ అవుతున్నది. దీంతో రాజధాని నుంచి జిల్లాలకు వెళ్లే రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఈ క్రమంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలో ఉన్న పంతంగి టోల్ ప్లాజావద్ద (Panthangi Toll Plaza) వాహనాలు క్యూకట్టాయి. పండుగ వాహనాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. అదేవిధంగా హైదరాబాద్-వరంగల్ రహదారిపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది.
కాగా, ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా సర్వీసులను పెంచేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. త్యేక బస్సుల్లో సుమారు మూడు లక్షలకు పైగా ప్రయాణికులు తమ స్వస్థలాలకు క్షేమంగా చేరుకున్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపిస్తున్నామంటున్న యంత్రాంగం, 13, 14 తేదీల్లో తిరుగు ప్రయాణానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. అయితే మరిన్ని అదనపు సర్వీసులు నడపాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. పిల్లాపాపలతో ఊరెళ్లాలంటే గంటల కొద్దీ రోడ్లపై నిరీక్షించాల్సి వస్తున్నదని వాపోతున్నారు.