Tomato | ఒక్కసారిగా ధరలు పెరగడంతో సామాన్యుడికి అందకుండా పోయిన టమాటా.. ఇప్పుడు వరంగల్ లక్ష్మీపురం మార్కెట్లో చెత్తకుప్పను చేరింది. భారీ వర్షాలకు తోడు.. అధిక ధరల కారణంగా సేల్స్ తగ్గంతో టమాట వ్యాపారులకు తీవ్ర నష్టం మిగిల్చింది.
కొద్దిరోజులుగా కొండెక్కిన టమాట ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. టమాట ధరలు పెరగడంతో రైతులు లక్షలు సంపాదిస్తున్న వార్తలను కూడా చూస్తూనే ఉన్నాం. ఎంత రేటు పెరిగినా టమాటకు డిమాండ్ ఉండటంతో దీన్ని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారు వరంగల్లోని టమాట వ్యాపారులు. మదనపల్లి, కర్ణాటక మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున టమాటలను తెప్పించారు. కానీ రెండు మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా మార్కెట్కు వచ్చేవాళ్ల సంఖ్య తగ్గింది. పైగా అధిక ధరలు ఉండటం వల్ల టమాటలు కొనేందుకు కూడా సామాన్యులు ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున టమాటలు కుళ్లిపోయాయి. దీంతో చేసేదేమీ లేక వాటన్నింటినీ తీసుకొచ్చి చెత్తకుప్పలో పడేశారు. పశువులకు ఆహారంగానూ వేసేశారు. భారీ పెట్టుబడితో తీసుకొచ్చిన టమాటలు వర్షం కారణంగా ఒక్కరోజులోనే పాడవ్వడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.