హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే దెబ్బమీద దెబ్బతో కుదేలవుతున్న ఆ పార్టీలో బుధవారం ఊహించని పరిణామం చోటుచేసుకున్నది. బీఆర్ఎస్లోకి ఆ పార్టీ నేతల వలసల పరంపర కొనసాగుతున్న వేళ మరోసారి కాంగ్రెస్‌కు కొలుకోలేని దెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ సోదరుడు, ఆ పార్టీ కీలక నేత పెద్ద శ్రీశైలం యాదవ్ చిన్నకొడుకైన గౌతమ్యాద వ్ హస్తం పార్టీని వీడి గులాబీ గూటికి చేరాడు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా రు. ఈ సందర్భంగా గౌతమ్యాదవ్ సహా మరికొందరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మ గెలుపులో భాగస్వామి అయ్యేందుకు వచ్చిన ఆయనను మనసారా అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ విజయానికి నిర్విరామంగా కృషి చేయాలని కోరారు.
కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి
కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడైన గౌతమ్యాదవ్ బీఆర్ఎస్లో చేరడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామం చెయ్యి పార్టీకి శరాఘతంగా మారగా, గులాబీ పార్టీలో జోష్ కనిపిస్తున్నది. గౌతమ్ చేరికతో బీఆర్ఎస్కు మరింత బలం చేకూరినట్టయిందని రాజకీయ విశ్లేషకులు భావి స్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మరికొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్‌ను వీడనున్నట్టు వార్తలు వస్తుండటం ఆ పార్టీ ముఖ్యనేతలు, మంత్రులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే క్యాడర్ చెల్లాచెదురైందని, ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి బొల్తా పడటం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. సీఎం, మంత్రుల మధ్య విభేదాలు రావడం, కమీషన్లు పంచుకుంటూ గొడవలకు దిగుతున్నారనే వార్తలు గుప్పుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ అభ్యర్థి పూర్తిస్థాయిలో పోటీనిచ్చే అకవాశం కనిపించడంలేదని ఆ పార్టీ ముఖ్యనేతలే విస్మయం వ్యక్తంచేస్తున్నారు.