TGMDC | హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ) : తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ)లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అధికారుల ‘అమ్యామ్యాల’ కారణంగా రూ.400 ఉన్న టన్ను ఇసుక ధర.. వినియోగదారుకు చేరేసరికి రూ.2000 దాటుతున్నది. వర్షాల సీజన్లో ఈ ధర మరింత పెరుగుతున్నది. ఆన్లైన్లో లొసుగులను ఆసరాగా అధికారులు, దళారులు కుమ్మక్కై ఇసుక దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును జేబుల్లో నింపుకొంటున్నారు.
ఇసుక వ్యాపారంలో అక్రమాలు అరికట్టేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దళారుల ప్రమేయం లేకుండా టీజీఎండీసీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే ఇసుకను ఇంటికి చేర్చడం దీని ముఖ్యోద్దేశం. ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవస్థ గాడితప్పింది. ప్రస్తుతం టన్ను ఇసుకను టీజీఎండీసీ రూ.406కు విక్రయిస్తుండగా, రవాణా ఖర్చులు కలుపుకొని టన్ను రూ.800 నుంచి 1000 వరకు అందాలి. కానీ, రూ.1800 నుంచి కొన్ని సందర్భాల్లో రూ. 2,500 వరకూ వినియోగదారు చెల్లించాల్సి వస్తున్నది. టన్ను ఇసుకపై రూ.1000 నుంచి రూ.1500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఎవరైనా నేరుగా ఆన్లైన్లో బుక్ చేసుకొని తెచ్చుకుందామంటే.. దళారులు లేనిదే బుకింగ్ సాధ్యం కాదు. కొన్ని ఎంపికచేసిన మీ-సేవా కేంద్రాల్లో ‘బాట్ సాఫ్ట్వేర్’ ద్వారానే బుక్ అవుతుంది. బుకింగ్ కోసం దళారులకు రూ. 5000 చొప్పున సమర్పించుకోవాలి. స్టాక్‌యార్డ్‌ల వద్ద ఉచితంగా లోడ్ చేయాల్సి ఉన్నా అక్కడ ఒక్కో ట్రిప్పునకు రూ.1000 సమర్పించాలి. ఈ అక్రమ వసూళ్లను నిలిపివేయాలని, తమకే బుకింగ్ వెసులుబాటు కల్పించాలని ఇటీవల లారీ యజమానులు టీజీఎండీసీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.
పెద్ద మొత్తంలో ఇసుక అవసరమైన ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ బిల్డర్లు, కాంట్రాక్టర్లు బల్క్‌గా బుక్ చేసుకునే వీలుంది. నిర్ధారిత ధర చెల్లించి వారు బుక్ చేసుకున్న పరిమాణం వరకు ఇసుక రవాణా చేసుకోవచ్చు. ఇదే టీజీఎండీసీలోని కొందరు అధికారులు, దళారులకు వరంలా మారంది. ప్రభుత్వ, ప్రైవేట్ బిల్డర్ల పేరుతో భారీగా ఇసుక బుక్ చేసుకొని అధిక ధరకు లారీ యజమానులకు విక్రయిస్తున్నారు. గత ఆగస్టు ఆరో తేదీన కొందరు దళారులు వాటర్‌బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పేరుతో 1.4లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక బుక్ చేయగా, వాస్తవాలను పరిశీలించకుండానే టీజీఎండీసీ అధికారులు మూడు రోజుల్లోనే మంజూరు ఇచ్చారు. బుక్ చేసుకున్న దళారులు ఆ ఇసుకను దాదాపు 150 మంది లారీ యజమానులకు అధికరేటుకు విక్రయించగా, ఇప్పటికే సుమారు 40వేల మెట్రిక్ టన్నుల ఇసుకను లారీ యజమానులు రవాణా చేశారు. ఈ మధ్య విషయం బయటకు పొక్కి వాటర్‌బోర్డు నుంచి ఎలాంటి ఇసుక బుకింగ్ లేదని టీజీఎండీసీ ఉన్నతాధికారులకు తెలియడంతో వెంటనే వారు తాము ఇచ్చిన మంజూరును రద్దుచేశారు. దీంతో దళారులకు 1.4లక్షల టన్నులకు డబ్బులు చెల్లించిన లారీ యజమానులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇసుక మంజూరు రద్దయినందున తాము దళారులకు చెల్లించిన మొత్తాన్ని వాపస్ ఇవ్వాలని, లేకుంటే ఇసుకను రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించాలని టీజీఎండీసీని కోరుతున్నారు.
టీజీఎండీసీలో బల్క్ బుకింగ్‌ల బాగోతం ఎంతోకాలంగా కొనసాగుతున్నది. ఇప్పుడు వెలుగులోకొచ్చింది మచ్చుకు ఒక్కటి మాత్ర మే. అధికారులు, దళారులు కుమ్మక్కై బల్క్ బుకింగ్ చేయడం, అనంతరం లారీ యజమానులకు అధికరేటుకు విక్రయించడం మామూ లే అని లారీ యజమానులు చెప్తున్నారు. తాజాగా వ్యవహారం బయటకు పడి మంజూ రు రద్దవడంతో వివాదం తలెత్తిందని, లేదంటే ఇది ఎప్పటిలానే కొనసాగేదని పేర్కొంటున్నా రు. తాము సొంతంగా బుక్ చేసుసుకునే అవకాశం లేదని, ఒక్కో ట్రిప్పుకు రూ.5000 వర కు దళారులకు సమర్పిస్తేనే తమకు ఇసుక మంజూరు లభిస్తున్నదని, కొందరు అధికారులు, దళారులు కుమ్మక్కై ఈ దందా కొనసాగిస్తున్నారని వాపోతున్నారు. టీజీఎండీసీ ద్వారా ప్రతి నెట సగటున వానకాలంలో అయితే 20లక్షల మెట్రిక్ టన్నులు, మిగిలిన కాలాల్లో 40లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. టీజీఎండీసీ టన్ను ఇసుకు రూ.406కు విక్రయిస్తుం టే, వినియోగదారుల రూ. 2000చెల్లించి కొ నుగోలు చేయాల్సి వస్తున్నది. దీన్నిబట్టి దోపిడీ ఏ స్థాయిలో ఉన్నదదో అర్థం చేసుకోవచ్చు.