హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘కాదేదీ అనినీతికి అనర్హం’ అన్న చందంగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తీరు కొనసాగుతున్నది. తాజాగా 108 అంబులెన్స్‌లో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఉద్దేశపూర్వకంగా వాహనాలను బ్రేక్‌డౌన్ చేసి సిబ్బంది నెలరోజులు పనిచేయాల్సి ఉండగా, 15 నుంచి 20 రోజులే డ్యూటీలు వేస్తూ అధికారులు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లతోపాటు అన్ని స్థాయిల అధికారులకు డబ్బులు ముడుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 580 వరకు 108 అంబులెన్స్‌లు ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 213 కొత్త వాహనాలను ప్రారంభించింది. దీంతో 108 అంబులెన్స్‌ల సంఖ్య 793కి చేరింది. వీటిలో 4,758 సిబ్బంది పనిచేస్తున్నారు.
వీరి స్థాయిని బట్టి ఈఎస్ఐ, పీఎఫ్ కలుపుకుని రూ.22,000 నుంచి రూ.30,000 వరకు వేతనంగా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా సిబ్బంది వేతనం, 108 అంబులెన్స్ మెయింటెనెన్స్‌కు ఒక్కో వాహనానికి ప్రభుత్వం ప్రతి నెలా కాంట్రాక్టు కంపెనీకి రూ.2 లక్షల వరకు చెల్లిస్తున్నది. అయితే నెలలో 30 రోజులు వీరు పని చేయకుండా ఉద్దేశపూర్వకంగా వాహనాలను బ్రేక్‌డౌన్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. నెలలో 15-20 రోజులు మాత్రమే పనిచేస్తుండగా.. ఒక్కో ఉద్యోగికి రూ.12,000-రూ.18,000 వరకు మాత్రమే వేతనం వస్తున్నదని సిబ్బంది వాపోతున్నారు. పది రోజులపాటు తమకు విధులు కేటాయించకుంటే ఎలా? అని అధికారులను ప్రశ్నిస్తే.. రిలీవర్ ఉన్నారని ఆఫ్ తీసుకోవాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారని సిబ్బంది చెప్తున్నారు.
ప్రతి నెలా 7.5 కోట్లు ఆఫీసర్ల జేబుల్లోకి..!
ఒక్కో వాహనానికి ప్రభుత్వం రూ.2లక్షలు కేటాయిస్తుండగా.. ఆ మొత్తంపై కన్నేసిన కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా 108 సిబ్బంది తక్కువ రోజులు విధులు నిర్వహించేలా కుట్రపన్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒకవైపు వాహనాన్ని బ్రేక్‌డౌన్ చేస్తూనే, మరోవైపు మెయింటెనెన్స్ డబ్బులపై అధికారులు కన్నేశారు. ఇలా ఒక్కో వాహనానికి రూ.లక్ష చొప్పున మొత్తంగా ప్రతి నెలా రాష్ట్రవ్యాప్తంగా రూ.7.5 కోట్లు అధికారులు మిగుల్చుకుంటున్నారని సమాచారం. ఈ మొత్తం వ్యవహారం ఓ మంత్రి కూతురి కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. సదరు మంత్రి కూతురు రాష్ట్రంలోని నిమ్స్, గాంధీ, నిలోఫర్, ఉస్మానియా సహా ఇతర జిల్లాల 108 మెయింటెనెన్స్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఇదంతా జరగదని సిబ్బంది చర్చించుకుంటున్నారు.