వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం (Karthika Masam) చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజన్న సన్నిధిలో కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు బారులు తీరడంతో గర్భాలయంలో ఆర్జిత, అన్న పూజల సేవలను అధికారులు రద్దు చేశారు. స్వామివారి దర్శనానికి 3 గంటలకుపైగా సమయం పడుతున్నది. భద్రాచలంలో గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. నదిలో కార్తిక దీపాలు వదిలారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు.. కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. గరళకంఠుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా, నవంబర్ 2న ప్రారంభమైన కార్మిక మాత్రం ఈ వారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కార్మిక మాస చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చారు.