హైదరాబాద్: ప్రజా భవన్లో ప్రజావాణి (Prajavani) కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగుతున్నది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ప్రజా భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే ఉదయం 10 గంటల వరకు వచ్చినవారికి మాత్రమే అవకాశం కల్పిస్తుండటంతో తెల్లవారుజాము నుంచి ప్రజాభవన్‌కు చేరుకుంటున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా లైన్లలో నిల్చుంన్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుంది, సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
కాగా, ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీల అమలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో లబ్ధిదారులకు అభయహస్తం దరఖాస్తులను పంపిణీ చేసి అక్కడే తీసుకుంటున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అప్లికేషన్ ఫామ్స్ కోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచే సంబంధిత కార్యాలయాల వద్ద క్యూలైన్లలో ఉంటున్నారు. కొన్ని చోట్ల నిలబడే ఓపికలేక చెప్పులను లైన్లలో ఉంచుతున్నారు.