హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తున్నది. ప్రభుత్వం రూ.7వేలకోట్లకుపైగా నిధులు ఖర్చు చేయనుండగా.. సామాజిక బాధ్యతగా దాతలు పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరీంనగర్‌కు చెందిన టీఆర్ఎస్ నేత చల్మెడ లక్ష్మీనరసింహరావు పాఠశాల భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు.
తన తండ్రి, మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు కోరిక మేరకు.. సొంత గ్రామమైన సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రూ.కోటితో స్కూల్ భవన నిర్మాణానికి కార్పొరేట్ పాఠశాల స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. ఇందుకు సంబంధించిన బిల్డింగ్ ప్లాన్‌ను, ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌కు అందించారు. భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి రాబోయే విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉండేలా చూస్తానని మంత్రి కేటీఆర్‌కు లక్ష్మీనరసింహరావు హామీ ఇచ్చారు. ప్రభుత్వం పిలుపు మేరకు కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చిన లక్ష్మీనరసింహారవును మంత్రి కేటీఆర్ అభినందించారు.