నర్సంపేట,డిసెంబర్ 7 : తెలంగాణ తల్లివిగ్రహాల రూపు మార్చడం రాష్ట్ర సీఎం రేవంత్ కట్రనేనని బీఆర్ఎస్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం నర్సంపేటలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతున్న కాంగ్రెస్ విధానాలను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి, తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి రూపం మార్చే కుట్రలను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అందించేంలా ఉండాలని సూచించారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కోసం సెక్యూరిటీని, కాన్వాయ్‌ని వదిలేసి దొంగచాటుగా పెద్ద అంబర్‌పేటకు వెళ్లిన గజదొంగ ముఖ్యమంత్రి రేవంత్ అని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహాలు ఊరూరా ఇప్పటికే వెలిశాయని గుర్తు చేశారు. కుల, మహిళాసంఘాలు, ప్రజలు స్వచ్ఛంగంగా ప్రతి సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ప్రతిచోటా ఆ తల్లిని కొలుచుకున్నామని గుర్తు చేశారు. నర్సంపేటలో 40, రాష్ట్ర వ్యాప్తంగా 6500 సెంటర్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయని వెల్లడించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే బీఆర్ అంబేద్కర్ పేరును కేసీఆర్ సెక్రటేరియట్‌కు పెట్టారని తెలిపారు. సీఎం రేవంత్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించకుండా ఆయనను అవమానించారని, టీఎస్‌ను టీజీగా మార్చి తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.