Baswapur Reservoir | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ వద్ద నిర్మించిన రిజర్వాయర్ కట్టను తవ్వి భారీ విద్యుత్తు లైన్లను నిర్మిస్తున్నారని, ఫలితంగా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆ గ్రామానికి చెందిన బాలస్వామి, నర్సింహ ఆధ్వర్యంలో పలువురు గ్రామస్థులు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యంతో, 13.73 కిలోమీటర్ల పొడవుతో బస్వాపూర్ రిజర్వాయర్‌ను నిర్మించారని వివరించారు. అయితే, ప్రస్తుతం రిజర్వాయర్ టోల్ డ్రెయిన్‌ను పూర్తిగా తొలగిస్తూ 33 కేవీకి సంబంధించి 14 విద్యుత్తు లైన్ల టవర్లను ఏర్పాటు చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ఆనకట్టను సైతం కొద్దిమేర ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా సీపేజీ సజావుగా సాగకపోవడంతోపాటు కట్ట బలహీనమై పోతుందని, కట్టకు ఏదైనా జరిగితే దిగువన ఉన్న అనేక గ్రామాలతోపాటు యాదగిరిగుట్ట దేవస్థానానికి సైతం ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని, విద్యుత్తు లైన్ల పనులను నిలిపివేయించాలని కోరారు. పనులకు సంబంధించిన ఫొటోలను కూడా ఈ సందర్భంగా అధికారులకు అందజేశారు. దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులను సంప్రదించగా, పనులతో అలాంటి ఇబ్బందేమీ లేదని పేర్కొన్నారు. కరెంటు టవర్లను వేసిన అనంతరం తిరిగి యథాప్రకారం వాటిని భర్తీ చేస్తారని వెల్లడించారు.