హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నది. వర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించవద్దని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈనేపథ్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు భూమిని చదును చేసేందుకు పెద్ద సంఖ్యలో జేసీబీలను వర్సిటీకి తరలించారు. ప్రొక్లైనర్తో చెట్లను తొలగిస్తున్నారు.
కాగా, ఉగాది పండుగ పూట హెచ్‌సీయూ రణరంగంలా మారిన విషయం తెలిసిందే. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పండుగ రోజు కావడంతో విద్యార్థులెవరూ బయటకు రారని, తమకు అడ్డుచెప్పేవారు ఎవరూ ఉండరని గుట్టు చప్పుడు కాకుండా టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను పెకిలించసాగారు. గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు. దొరికినోళ్లను దొరికినట్టే బంధించి వ్యాన్లలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు.
ప్రతిఘటించినవారిని లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవవైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్ షీల్డ్‌తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.
బట్టలు చిరిగినా వదలకుండా
పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టుపట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈక్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను గుంజుకెళ్లారు. ఇతర రాష్ర్టాల వాళ్లు కావడంతో తెలుగు రాదని.. బూతులు తిడుతూ లాక్కెళ్లారు. గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వ్యాన్ ఎక్కించి ఠాణాలకు తరలించారు. అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్‌లో పడేశారు. పక్క కు నిలబడ్డ కొందరు విద్యార్థులను అకారణంగా లాక్కెళ్లి వ్యాన్ ఎక్కించారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. 400 ఎకరాల భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, అరెస్ట్ చేసిన విద్యార్థులను వదిలిపెట్టేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.