హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): మూడు రోజులుగా రైతుబంధు పైసలు పడుతుండటం.. చెరువుల్లో పుష్కలంగా నీళ్లుండటంతో రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు ఉత్సాహంగా సాగుతున్నది. దాదాపు అన్ని జిల్లాల్లో గతంతో పోల్చితే నెలరోజుల ముందే వరినాట్లు పడుతున్నాయి. సాధారణంగా సంక్రాంతి వరకు నాట్లు వేస్తుండగా, ఈ సారి ఇప్పటికే సగం పూర్తికావడం గమనార్హం. గత యాసంగిలో ఈ సమయానికి 1.18 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. ప్రస్తుతం 5.35 లక్షల ఎకరాలకు చేరింది. అంటే గత యాసంగితో పోల్చితే ఏకంగా 4.17 లక్షల ఎకరాల్లో అత్యధికంగా వరి సాగు కావడం విశేషం. గత యాసంగిలో మొత్తం 11.65 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఇపుడు 14.55 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అంటే సుమారు 3 లక్షల ఎకరాల్లో అధికంగా పంటలు సాగు చేయడం రికార్డుగా చెప్పొచ్చు. గతంతో పోల్చితే యాసంగిలో అన్ని జిల్లాల్లో వరి పంటే సాగువుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
కాలువల్లో నీళ్లు..చేతిలో పైసలు
పంటల సాగుకు కావాల్సిన నీళ్లు అన్ని గ్రామాల్లో పుష్కలంగా ఉన్నాయి. పంట పెట్టుబడికి పైసలు ప్రభుత్వం నాలుగురోజులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఎక్కడిక్కడ ప్రాజెక్టుల నిర్మాణంతో అన్ని జిల్లాల్లో సాగునీటితోపాటు భూగర్భ జలాలు బాగా పెరిగాయి. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరంతోపాటు ఎస్ఆర్ఎస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టులతో యాసంగిలో పంటల సాగుకు అవసరమైన నీరు అందుతున్నది. పెట్టుబడికి కావాల్సిన నిధులను రైతుబంధుతో సమకూర్చుతున్నది. ఇప్పటికే 10వ విడుత రైతుబంధు ద్వారా సుమారు రూ.4 వేల కోట్లను 50 లక్షల మంది రైతులకు అందించింది. వానకాలం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి డబ్బులు అందించడంతో రైతులు ఉత్సాహంగా సాగుపనుల్లో నిమగ్నమయ్యారు.
రికార్డుస్థాయికి విద్యుత్తు వినియోగం
రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా డిసెంబర్లోనే వరి సాగు పెరగడంతో విద్యుత్తు వినియోగం అనూహ్యంగా పెరిగింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి డిసెంబర్లో 14వేల మెగావాట్లకు పైగా విద్యుత్తు డిమాండ్ నమోదు కావడం విశేషం. ఈ సీజన్లో భారీగా వరి సాగయ్యే అవకాశం ఉండటంతో మరో నెలరోజుల్లో 15,500 మెగావాట్లకు చేరుకొనే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.