అయిజ (జోగులాంబ గద్వాల): కర్ణాటకను వరణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి వరద ప్రవాహం మొదలైంది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతున్నది. కర్ణాటకలో ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు 10,743 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 643 క్యూసెక్కులు, దిగువకు 10,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

దీంతో సుంకేసుల ఆనకట్టకు 10,100 క్యూసెక్కులు వస్తున్నది. తుంగభద్ర డ్యాంకు కూడా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 26,858 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నదని అధికారులు వెల్లడించారు.