భూపాలపల్లి: భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 12 మీటర్లకు చేరింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 2 గంటలకు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పుష్కర ఘాట్వద్ద 12.57 మీటర్ల ఎత్తులో పారుతుండగా, 10.9 లక్షల క్యూసెక్కుల నీరు లక్ష్మి బరాజ్ వైపు ప్రవహిస్తున్నది.
అదేవిధంగా.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతున్నది. గోదావరిలో 5,71,070 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నీటిమట్టం 34.7 అడుగులకు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.