యాదాద్రి, డిసెంబర్ 18: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి గర్భాలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. రెండున్నర నెలల్లో రూ.9.14 కోట్ల నగదు, రెండు కిలోల పైచిలుకు బంగారాన్ని పలువురు భక్తులు స్వామివారికి సమర్పించుకున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా 125 కిలోల బంగారంతో నిర్మించనున్న యాదాద్రీశుడి గర్భాలయ విమాన గోపురం బంగారు తాపడానికి సుమారు రూ.65 కోట్లు సేకరించాల్సి ఉన్నది. ఈ మహాకార్యంలో ప్రజలను భాగస్వాములను చేయాలని అక్టోబర్ 19న యాదాద్రిలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు సెప్టెంబర్ 25 నుంచే ఆలయ అధికారులు విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. నాటి నుంచి ఈనెల 16 వరకు రూ.9,14,32,622 నగదు విరాళం స్వామివారి ఖాతాలో జమ అయ్యాయి. ఇందులో చలాన్ల ద్వారా రూ.2,56,17,944, ఆర్టీజీఎస్, నెఫ్ట్, క్యూఆర్ కోడ్, ఆన్లైన్ ద్వారా రూ. 1,43,00,350, చెక్కులు, డీడీల ద్వారా రూ. 5,13,68,110, హుండీ ద్వారా రూ.1,46,218 విరాళాలు వచ్చాయి. 2.433 కిలోల బంగారం స్వామివారికి చేరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.