Rajanna Temple | వేములవాడ టౌన్, జూన్ 2 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా కనిపించాయి. వేకువ జాముననే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేశారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆ తర్వాత క్యూలైన్లలో బారులు తీరి మొక్కులు చెల్లించుకున్నారు.
అయితే, దర్శనాలకు దాదాపు 5 గంటల సమయం పట్టిందని పలువురు భక్తులు ఆరోపించారు. గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చిందని.. భక్తులకు కనీస వసతులు కల్పించలేదంటూ భక్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, త్వరలోనే రాజన్న ఆలయాన్ని మూసివేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం కరువడంతో దుర్వాసన వస్తోందని.. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని భక్తులు ఆరోపించారు. అధికారులు భక్తుల కనీస అవసరాలపై దృష్టి సారిస్తే బాగుంటుందని పలువురు భక్తులు సూచించారు. కోడె మొక్కులు చెల్లించుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మగుండంలో నీరు కొద్దిగా వాసన రావడంతో స్నానం చేద్దామనుకున్నా.. చేయలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా దృష్టి సారించాలని భక్తులు సూచిస్తున్నారు.
ఆలయ ప్రాంగణంలో కల్యాణ కట్ట ఎదుట భక్తులకు క్యూ లైన్లో నిలబడ్డ భక్తులకు మంచినీటి వసతి కరువైందని తెలిపారు. ఆలయ పరిసరాల్లో క్యూ లైన్లో భక్తులకు కనీసం మంచినీటి సదుపాయం కల్పించకపోవడంపై మండిపడ్డారు. ఆలయ అధికారులు కేవలం ఆదాయంపై దృష్టి సారిస్తున్నారని, భక్తుల కనీస అవసరాలపై దృష్టి సారిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా రాజన్నను సోమవారం ఒకే రోజు 80వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి దాదాపు రూ.40లక్షల ఆదాయం సమకూరిందని అంచనా.