వేములవాడ: రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలో (Vemulawada) భక్తుల రద్దీ నెలకొన్నది. శ్రావణమాసం (Sravana Masam) చివరి సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో భారీగా భక్తులు బారులుతీరారు. ఈ నేపథ్యంలో గర్భాలయంలో ఆర్జిత అన్న పూజల సేవలను అధికారులు రద్దుచేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు వేచిఉండటంతో స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. తెల్లవారుజామునే రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
కాగా, గత నెల 25న వేములవాడలో శ్రావణమాస మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నాలుగు సోమవారాల్లో ప్రతీవారం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం వేళ లింగార్చన కార్యక్రమం జరిపారు. అలాగే ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ రాజరాజేశ్వరి దేవికి షోడశోపచార పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 9న రాఖీ పౌర్ణమి సందర్భంగా రుగ్వేద, యజుర్వేద ఉపాకర్మ కార్యక్రమాలు నిర్వహించారు.