బేగంపేట్, జూలై 13: లష్కర్ బోనాల జాతర (Ujjaini Mahakali Bonalu) వైభవంగా కొనసాగుతున్నది. వేకువ జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం 4 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతించారు. పెద్ద సంఖ్యలో ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు బారులు తీరారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పీఎల్ శ్రీనివాస్, సనత్నగర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోట నీలిమ అమ్మవారిని దర్శించుకున్నారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య, కమిషనర్ ఐ వెంకటరావు, నార్త్ జోన్ డీసీపీ రష్మిక పెర్మల్ భక్తులకు ఎలాంటి ఇబ్బందు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపడుతున్నారు.