Elkathurthy Meeting | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజల నుంచి ఊహించిన దానికంటే మించిన స్పందన వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి సభా ప్రాంగణానికి లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. సభలోని జనాల డ్రోన్ విజువల్స్ చూసి టీవీల ముందు కూర్చున్న ప్రతీఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. 8 లక్షల మంది రావొచ్చని కొందరంటే, 10 లక్షల మంది వచ్చారని మరికొందరు, 15 లక్షల మంది దాటారని ఇంకొందరు ఎవరికి వారు లెక్కలేసుకొన్నారు. ఇదే విషయమై ఏఐ టూల్స్, చాట్బాట్లను ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ సభకు తక్కువలో తక్కువ 8.5 లక్షల నుంచి 10 లక్షల మందివరకు వచ్చినట్టు తేల్చాయి.
టెక్నికల్ లెక్కల ప్రకారం
బీఆర్ఎస్ సభకు ఎంతమంది వచ్చారన్న విషయాన్ని సాంకేతికంగా తెలుసుకోవడానికి ఏఐ టూల్ ఔట్లేయర్ ఏఐను కొందరు నెటిజన్లు వినియోగించారు. సభలోని జనం డ్రోన్ వీడియోలు, ఫొటోలను అప్లోడ్ చేశారు. ప్రత్యేక సాఫ్ట్వేర్ టూల్ ద్వారా ఒక్కో మనిషిని (హెడ్ కౌంట్) గ్రీన్ మార్క్‌గా చేసుకొని లెక్కించడం మొదలుపెట్టిన ఔట్లేయర్.. ఆదివారం సాయంత్రం 6.50 గంటలకు సభాప్రాంగణంలో 8.5 లక్షల మంది ఉన్నట్టు తేల్చింది. డ్రోన్ విజువల్స్‌లో కవర్ అయిన ప్రాంతాన్ని బట్టి ఈ సంఖ్యను చెప్పింది. అప్పటికే సుమారు లక్షన్నర మంది ఇంకా సభాప్రాంగణానికి చేరుకోలేకపోయారని కేసీఆర్ తన ప్రసంగంలో చెప్పారు.
ఇక సభకు హాజరైన జనం గురించి ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ను ప్రశ్నించగా 10 లక్షల కంటే ఎక్కువ మంది వచ్చారని బదులిచ్చింది. సభతో పాటు, సభాప్రాంగణం బయట ఉన్నవారు, కాంగ్రెస్ సర్కారు అడ్డగింతతో ఎల్కతుర్తి దగ్గరి వరకు వచ్చి ఆగిపోయిన వారితో కలుపుకొంటే సభకు మొత్తంగా 15 లక్షల కంటే ఎక్కువ మందే వచ్చి ఉంటారని నెటిజన్లు పోస్టులు పెట్టారు. కాగా సభకు 10 లక్షల మందివరకు వస్తారని బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు అంచనా వేసుకుంటే.. అంతకుమించి జనం తండోపతండాలుగా వచ్చారంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి.