హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ ) : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిశీలకులు సహా సామాన్యుల వరకు అందరి చూపు ఇప్పుడు ఎల్కతుర్తి సభపైనే ఉన్నది. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న నిర్వహించబోయే సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉండబోతున్నది. సభకు జరుగుతున్న ఏర్పాట్ల నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎల్కతు ర్తి సభ గురించే చర్చ జరుగుతున్నది. మేడారం సమ్మక్క-సారక్క జాతరను తలపించేలా జరుగుతున్న ఏర్పాట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. మరో నాలుగు రోజుల్లోనే సభ జరగనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ దండు కదల డం మొదలైంది. రాష్ట్రం నలువైపుల నుంచి జాతరకు వెళ్తున్నట్టు.. చీమల దండు కదిలినట్టు.. ఇంట్లో పెళ్లికి ఊరేగింపుగా కదిలినట్టు అప్పుడే పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఎల్కతుర్తికి బయల్దేరుతున్నారు.
పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ఎల్కతుర్తికి చేరుకొని, సభాస్థలిలో ఏర్పాట్లను చూసి వస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒకసారి సభాస్థలి వద్దకు వెళ్లివచ్చారు. ఇప్పుడు తమ తమ నియోజకవర్గాలకు, గ్రామాలకు వెళ్లి ప్రజలతో కలిసి రజతోత్సవ వేడుక కోసం కదలడం కనిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతీ గ్రామం నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజుల ముందు నుంచే ఎడ్ల బండ్లలో వెళ్లేవారు, పాదయాత్రగా వెళ్లేవారు తమ తమ యాత్రలను ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా నుంచి ఎడ్ల బండ్ల యాత్ర మంగళవారం ప్రారంభమవ్వగా.. మరికొన్ని జిల్లాల్లో పాదయాత్రలు మొదలయ్యాయి. బృందాలుగా ఏర్పడి కొందరు.. సొంతంగా మరికొందరు జాతరకు వెళ్లినట్టు వెళ్తున్నారు. వీరంతా ఆదివారం నాటికి ఎల్కతుర్తికి చేరుతారు. స్వచ్ఛందంగా ఒక రాజకీయ పార్టీ కోసం ప్రజలు కదిలిరావడం ఇటీవల కాలం లో మనం చూసి ఉండం. ఇలాంటి అద్భుతమైన ఘట్టాన్ని ఎల్కతుర్తి సభ సందర్భంగా చూస్తున్నాం.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం నందినగర్‌లో కేటీఆర్‌కు రూ. 6 లక్షల చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
సభకు వచ్చేవారి కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ 12 మంది వైద్యులను కూడా అందుబాటులో పెడుతున్నది. పది చోట్ల ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతున్నది. ఆరు అంబులెన్స్‌లను కూడా అందుబాటులో పెడుతున్నారు. లక్షలాది మంది హాజరయ్యే సభ కావడంతో ఎవరికైనా, ఏదైనా అత్యవసర చికిత్స అవసరమైతే అందించేందుకు ఈ ఏ ర్పాట్లన్నీ చేస్తున్నారు. ఎండాకాలం కావడంతో చాలామందికి డీహైడ్రేషన్ సమస్య ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో కావాల్సిన మందులతోపాటు నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
సభ కోసం సుమారు రెండున్నర వేల మంది వలంటీర్లను పార్టీ సిద్ధం చేసింది. వారి కోసం ప్రత్యేక టీషర్టులను కూడా రూపొందించింది. వీరికి తాత్కాలికంగా శిక్షణ కూడా ఇచ్చింది. ఎవరు, ఎక్కడ ఉండాలి?.. ట్రాఫిక్ జాం కాకుండా ఎలా చూడాలి?.. నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను ఎలా అందించాలి?.. అస్వస్థతకు గురైనవారిని ఎలా తరలించాలి?.. తదితర అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు. వీరిలో మెజార్టీ వలంటీర్లు ఇప్పటికే సభా ప్రాంగణం వద్దకు చేరుకొని సభాస్థలి ఏర్పాటు పనుల్లో పాల్గొంటున్నారు. వీరికి ప్రత్యేకంగా వాకీటాకీలు కూడా అందజేశారు. సభ రోజు ఒకవేళ మొబైల్ ఫోన్లు పనిచేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే వాకీటాకీలను అందుబాటులో ఉంచుతున్నారు.
రజతోత్సవ పాటల సీడీని ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ తదితరులు
సభాస్థలి వద్ద మీడియా ప్రతినిధులు, ఇతరులు ఉపయోగించుకునేలా వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ, స్థానిక మీడియాకు ఇబ్బంది కలుగకుండా వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నారు.
సభకు వచ్చేవారి కోసం సుమారు వెయ్యి మూత్రశాలలను, మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నారు. బయోటాయిలెట్లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ఈ సారి సభాస్థలికి సమీపంలో కొన్ని సెల్ఫీ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చేవారు కేసీఆర్, కేటీఆర్‌తో ఫొటో దిగినట్టు అనుభూతి కోసం వారి చిత్రపటాలతో కూడిన సెల్ఫీ బూత్‌లను ఏర్పాటు చేశారు.
నందినగర్‌లోని తన నివాసంలో చలో వరంగల్ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్, రసమయి బాలకిషన్, గాదరి కిశోర్ తదితరులు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎల్కతుర్తిలోని సభాస్థలి పరిశీలనకు రానున్నారు. అక్కడ ఉన్న పార్టీ ఇన్చార్జీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నప్పటికీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలను కేటీఆర్ ఇవ్వనున్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి హసన్‌పర్తి మీదుగా ఎల్కతుర్తికి చేరుకొని అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అక్కడే నాయకులతోనూ మాట్లాడుతారు. అందుబాటులో ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడి తిరుగు ప్రయాణమవుతారు.
ఎల్కతుర్తి, ఏప్రిల్ 22 :పదహారు నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఇప్పుడు ప్రజలంతా రాష్ర్టానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని భావిస్తున్నట్టు మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. ఎల్కతుర్తి రజతోత్సవ సభ ప్రాంగణాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ.. కుంభమేళాను తలపించేలా రజతోత్సవ సభ జరుగుతుందని అన్నారు. తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపి, దశదిశలా ఉద్యమాన్ని వ్యాపించి.. స్వయంపాలన కావాలనే లక్ష్యంతో కేసీఆర్ తెలంగాణ సాధించారని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి 50వేల మంది సభకు తరలివస్తారని తెలిపారు.