Industries | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పారిశ్రామికరంగం వెలవెలబోతున్నది. కొత్తగా కంపెనీలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడంలేదు. పదేండ్ల పాటు దేశానికి ఏ కంపెనీ వచ్చినా ముందుగా తెలంగాణ రాష్ర్టానికి ప్రాధాన్యతనివ్వగా, రేవంత్ ప్రభుత్వపాలనలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ సర్కారు పట్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం సడలింది. కేంద్ర కంపెనీ వ్యవహారాల శాఖ తాజా నివేదికలో వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం.
కంపెనీల ఏర్పాటుకు ‘నై’
2023 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చుకుంటే 2024 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో తెలంగాణవ్యాప్తంగా కంపెనీల నమోదులో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కంపెనీల ఏర్పాటు గతంతో పోలిస్తే ఏకంగా 12.4 శాతం మేర తగ్గింది. ఐదేండ్లలో ఇదే కనిష్ఠం. ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ తాజా నివేదికలో వెల్లడైంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఈశాన్యంలోని అతిచిన్న రాష్ట్రం మణిపూర్ ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ కూడా కొత్త కంపెనీల ఏర్పాటులో స్థిరత్వాన్ని నమోదు చేసింది.
గతం ఎంతో ఘనం
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎదిగింది. అమెజాన్, టీసీఎస్, డెలాయిట్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, విప్రో, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి కంపెనీలు అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి. నోవార్టీస్, జీఎస్కే, డాక్టర్.రెడ్డీస్ ల్యాబ్స్, అరబిందో, హెటిరో వంటి ఔషధ కంపెనీలు, ఆల్ఫాలాన్, బ్యాండ్రోన్, బెండిట్ వంటి లైఫ్ సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు చేపట్టాయి. ఔషధ కంపెనీలకు కేంద్రంగా ఉన్న జీనోమ్‌వ్యాలీని కేసీఆర్ సర్కారు గణనీయంగా విస్తరించడమే కాకుండా వైద్య పరికరాల కోసం సుల్తాన్‌పూర్‌లో ప్రత్యేకంగా మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ కండ్ల జోళ్లు, ఎక్స్‌రే మిషన్ల దగ్గర్నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ఎగుమతి చేసే స్టెంట్ల తయారీ పరిశ్రమ కూడా తమ కార్యకలాపాలు చేపట్టింది. వస్త్ర పరిశ్రమల్లో ఎంగ్‌వన్, కిటెక్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. ఇలా పదేండ్లలో దేశానికి ఏ పెట్టుబడి వచ్చినా ముందుగా తెలంగాణను సందర్శించి, ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేయకుండా ఉండలేదంటే రాష్ట్ర పారిశ్రామికరంగం ఏ స్థాయికి ఎదిగిందో ఊహించుకోవచ్చు.
ఇదీ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘మార్పు’: హరీశ్
రాష్ట్రంలో కంపెనీల నమోదులో గణనీయంగా తగ్గుదల నమోదు కావడం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ‘మార్పు’. కంపెనీలు తగ్గడం వల్ల ఆ ప్రభావం చాలా ఇతర అంశాలపై ప్రతికూల పడుతుంది. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తగ్గుతాయ. పన్నుల రాబడి కూడా తగ్గిపోతుందని తెలిపారు. స్టార్టప్ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో ఆంత్రప్రెన్యూర్షిప్ను, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నప్పటికీ… కంపెనీల తగ్గుదల చూస్తుంటే సీఎం తన లక్ష్యసాధనలో విఫలమైనట్లు స్పష్టమవుతున్నది.