హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో గుల్జార్‌హౌస్ వద్ద శ్రీకృష్ణ పెరల్స్ భవనంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనను తెలంగాణ మానవహక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది.
ఈ దుర్ఘటనలో 17 మంది మృతిచెందారని, భవన భద్రత, విద్యుత్తు నిర్వహణ, అగ్నిప్రమాద నివారణకు సంబంధించిన నిబంధనలను పాటించకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటూ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ నెల 30న విచారణ చేపట్టనున్నట్టు టీజీహెచ్ఆర్సీ ప్రకటించింది. ఈ లోగా ఆ అగ్నిప్రమాదంపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎస్‌తోపాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ, ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లను ఆదేశించింది.