హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో విలీనం చేసిన ప్రాంతాల ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్ఆర్ఏ)ను 24శాతానికి పెంచాలని టీజీఈజేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలు మం జూరు చేయడంతోపాటు, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. అలాగే పెండింగ్ బిల్లులు ప్రతినెలా రూ. 1500 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పరిసర ప్రాంతాలు, 27 మున్సిపాలిటీల్లోని ఉద్యోగులను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకువచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ నేత దామోదర్‌రెడ్డి, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేన్ ముజీబ్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, టీఎన్జీవో అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడు కస్తూరి వెంకట్, కొండల్‌రెడ్డి, పర్వతాలు, లక్ష్మణ్‌రావు, రామ్మోహన్రావు పాల్గొన్నారు.