హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 905 ప్రాథమిక సహకార సంఘాల ( ప్యాక్స్ )లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 5,600 మంది ఉద్యోగులకు హెచ్.ఆర్. పాలసీని అమలు చేయాలని ప్యాక్స్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ను కోరారు.
ఈ మేరకు సోమవారం మంత్రుల అధికారిక నివాసంలో టీ.ఆర్.ఎస్. కార్మిక విభాగం నాయకులు ఎల్. రూప్ సింగ్ ఆధ్వర్యంలో ప్యాక్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మోహన్ రావు, ప్రతినిధులు వినోద్ కుమార్ తో సమావేశమై వినతి పత్రాన్ని అందజేశారు.
గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్న తమకు హెచ్.ఆర్. పాలసీని అమలు చేసి, వేతన సవరణ చేయాలని ప్యాక్స్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కోరారు.
ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలను అందిస్తూ వారికి చేదోడువాదోడుగా ఉంటున్న తమకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
ఈ అంశాలను సీఎం కేసీఆర్ తో తాను, మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ఇప్పటికే మాట్లాడామన్నారు. త్వరలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతుందని వినోద్ కుమార్ ప్యాక్స్ ఉద్యోగులకు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
గురుకులాల ప్రారంభం స్టే ఎత్తివేయాలి.. హైకోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి
Crime news |సిమెంట్ లారీ బోల్తా.. డ్రైవర్ మృతి
ఒప్పో రెనో 7 ఫీచర్లు లీక్..ధర ఎంతంటే..!