హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ జోరుగా సాగుతుండగా.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 14 గ్రామాల ప్రజలు మాత్రం ఇందు లో పాల్గొనడం లేదు. పత్రాలను తీసుకోవడానికే వారు నిరాకరిస్తున్నారు. తాము కచ్చితం గా ఏ రాష్ట్రానికి చెందుతామో తేల్చిన తర్వాతే ఆ పత్రాలు తీసుకొంటామని తేల్చిచెప్తున్నారు. ఆ 14 గ్రామాలపై రెండు రాష్ట్రాలూ హకులు కోరుతుండగా, ఈ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నది. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన జరిగినప్పటి నుంచి ఆయా గ్రామాల ప్రజలు అటు మహారాష్ట్ర, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణ) ఎన్నికల్లో ఓటు వేస్తూ వస్తున్నారు.
రెండేసి చొప్పున సదుపాయాలు
ఆ 14 గ్రామాల్లో ఇద్దరు సర్పంచులు, రెండు రేషన్ దుకాణాలు, రెండు పాఠశాలలు (తెలుగు, మరాఠీ), రెండు విద్యుత్తు లైన్ల చొప్పున ఉన్నాయి. ప్రజల వద్ద రెండు రాష్ట్రాలకు చెందిన రేషన్, ఓటరు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆ ప్రాంతాలు ఇటు తెలంగాణలోని ఆసిఫాబాద్ (కుమ్రం భీం ఆసిఫాబాద్) జిల్లా కెరమెరి మండలం ఉండగా, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జీవతి తాలూకా పరిధిలోకి వస్తాయి. నిజాం పాలనలో ఆ గ్రామాలు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. ఆ తర్వాత భౌగోళికంగా అప్పటి ఏపీకి, సాంస్కృతికంగా మహారాష్ట్రకు దగ్గరగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సర్’ కార్యక్రమం రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి ప్రారంభంకావడంతో అధికారులు ఇబ్బందుల్లో పడ్డారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి. తెలంగాణ అధికారులు జూన్ 25న, మహారాష్ట్ర అధికారులు జూన్ 30న ఆయా గ్రామాల్లో ‘సర్’ పత్రాల పంపిణీకి వెళ్లారు.
కులాలవారీగా భిన్నాభిప్రాయాలు
పరంధోలి, ముకద్దంగూడ పంచాయతీల్లోని మరాఠీ మాట్లాడే ఎస్సీ ఓటర్లు మహారాష్ట్ర వైపు మొగ్గుచూపుతూ తెలంగాణ అధికారుల పత్రాలను తిరసరించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లంబాడీలు తెలంగాణ పత్రాలు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే లంబాడీలకు తెలంగాణలో ఎస్టీ (ఎస్టీ) హోదా ఉండగా, మహారాష్ట్రలో వారు వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్నారు. తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిస్తే తమ ఎస్టీ హోదా పోతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సుదీర్ఘ సరిహద్దు వివాదంపై 1983లో కేకే నాయుడు కమిషన్ ఇచ్చిన నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, ఈ కేసు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నది.